ఏపీ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసన్నకు తెలంగాణలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం హైదరాబాద్ నుంచి విజయవాడ రహదారిపై వెళ్తున్న ఆమె కారు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. మార్గమధ్యలో మునగాల మండలం ఆకుపాముల వద్ద ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేయబోయిన వాణి ప్రసన్న కారు రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.
డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కారు స్వల్పంగా డ్యామేజ్ అవ్వగా.. ప్రమాదం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసన్న సురక్షితంగా బయటపడింది. అనంతరం ఆమె మరో వాహనంలో ఏపీకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.