బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. పలు పార్టీలు వంశ రాజకీయాలకు పాల్పడుతున్నాయని.. ఇందుకు తమ పార్టీ వ్యతిరేకమని పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని అయ్యే అవకాశం ఒక్క బీజేపీలోనే ఉంటుందన్నారు.
దేశంలో ప్రస్తుతం చాలా పార్టీలు వంశ రాజకీయాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. లేదంటే కేవలం కొన్ని వర్గాల వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ఈ సంప్రదాయానికి బీజేపీ విరుద్ధమన్నారు. దళిత వ్యక్తి రాష్ట్రపతి, శాస్త్రవేత్త రాష్ట్రపతి, గిరిజన మహిళను కూడా రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. బీజేపీలో ప్రతీ ఒక్కరికీ సమాన హక్కులు, అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉదాహరణ అన్నారు. ఇతర పార్టీలలో అయితే.. ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరాలంటే.. గొప్ప కుటుంబం లేదా ఉన్నత వర్గానికి చెందిన వాడై ఉండాలన్నారు. అప్పుడే వారు జాతీయ అధ్యక్షులు లేదా ఉన్నత పదవులను చేపడుతారని జే.పీ.నడ్డా తీవ్ర ఆరోపణలు చేశారు.