ఏపీలోని చిత్తూరు జిల్లా వీకోట మండలం బోయ చిన్నాగణపల్లె పరిసరాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంట పొలాల్లోకి ఏనుగుల గుంపు రావడంతో రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లింది. నాయకనేరి అటవీ ప్రాంతంలోని గోభిదోని కుంట అడవి నుంచి బోయ చిన్నపల్లి గ్రామ సమీపంలో గల పంట పొలంలోకి 10 ఏనుగులతో కూడిన సముదాయం ప్రవేశించినట్లు సమాచారం.
ఏనుగుల దాడిలో అరటి, కొబ్బరి తోటలు, కూరగాయలు సహా పలు రకాల పంటలతో పాటు డ్రిప్ సిస్టమ్‌ను ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో గజరాజుల సంచారం ఎక్కువైందని రైతులు చెబుతున్నారు. ఇటీవల జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కడతట్లపల్లెలో పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేయగా.. కోత దశలో ఉన్న అరటి తోటలను సైతం తీవ్రంగా నష్టపరిచాయి. వెంటనే ఫారెస్టు అధికారులు చొరవ చూపి వాటిని దారి మళ్లించాలని రైతులు కోరుతున్నారు.