ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేసింది. ఇక మరికొన్ని దేశాల మధ్య నైతిక బంధం.. దౌత్య బంధాన్ని కూడా పెకిలించింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో.. రష్యా-అమెరికా సంబంధాలు ఉప్పు నిప్పుగా ఉన్నాయి. సమయం దొరికితే చాలు కస్సుబుస్సు మంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇరు దేశాల మధ్య మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
నల్లసముద్రంపై ఎగురుతున్న అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానం మంగళవారం ఢీ కొట్టింది. దీంతో డ్రోన్ ప్రొపెల్లర్ ధ్వంసమైంది. ఈ పరిస్థితుల్లో తమ డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో కూల్చేయాల్సి వచ్చిందని అమెరికా ప్రకటించింది.
‘‘నల్లసముద్రంలో అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా డ్రోన్‌ను రష్యాకు చెందిన రెండు సుఖోయ్-27 యుద్ధ విమానాలు ప్రమాదకరంగా, తగనిరీతిలో అడ్డుకున్నాయి. అందులో ఓ యుద్ధవిమానం మా డ్రోన్ ప్రొపెల్లర్‌ను ఢీకొట్టింది. అంతకు ముందు ఎంక్యూ-9 డ్రోన్ ముందు సుఖోయ్‌లు పలుమార్లు ఇంధనాన్ని కుమ్మరించాయి’’ అని అమెరికాకు చెందిన యూరోపియన్ కమాండ్ ఓ ప్రకటనలో వివరించింది.