ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మరోసారి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 19, 12న నమోదైన కేసుల్లో భాగంగా.. గురువారం ఉదయం షాహినాయత్, మంగళ హాట్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా పోలీసుల్ని మొహరించి మంగళహాట్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఆయనపై పీడి యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
అయితే చర్లపల్లి జైలులో చాలామంది ఉగ్రవాద ఖైదీలు ఉండడంతో రాజాసింగ్ ను ప్రత్యేక బ్యారేక్ లో ఉంచారు. మరోవైపు నెలలోపు పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ రాజాసింగ్ ను విచారించనుంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, నిందితుడి వివరాలను పరిశీలించనుంది పీడి యాక్ట్ అడ్వైజరీ కమిటీ. ఈ కమిటీ తీసుకునే నిర్ణయం పైనే రాజాసింగ్ కు జైలు శిక్ష ఆధారపడి ఉంటుంది.