అవయవదానం గొప్పతనాన్ని మరోసారి ఓ పదేళ్ల బాలుడు చాటాడు. తానూ చనిపోతూ మరో ఐదుగురి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కాపుగో దాయవలసకు చెందిన యువంత్ ఆరో తరగతి చదువుతున్నాడు.
జనవరి 29న పుట్టిన రోజు చేసుకున్న యువంత్.. మరుసటి రోజున కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అతన్ని పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ క్రమంలోనే వైద్యులు బాలుడికి పలు టెస్టులు చేయగా..గిలియన్ బ్యారీ సిండ్రోమ్ సోకిందని వైద్యులు వెల్లడించారు.
చికిత్స పొందుతున్న బాలుడు నిన్న బ్రెయిన్ డెడ్ కావడంతో వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు.దీంతో బాలుడి రెండు కళ్లు, లివర్, రెండు కిడ్నీలను సేకరించారు. వాటిని ఐదుగురికి అమర్చినట్లు వైద్యులు తెలిపారు.