కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా… ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున చేపట్టిన ఆందోళన ప్రకంపనలు రేపుతోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాల తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది సంఖ్యలో రైతులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. కేంద్రం చర్చల ఆహ్వానంపై ఇవాళ రైతు సంఘం నేతలు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.అయితే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన అన్నదాతలకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
సుమారు 500 రైతు సంఘాలు ఢిల్లీ నడిబొడ్డున చేస్తున్న ఆందోళన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిరసనల్లో పాల్గొనేందుకు వస్తున్న రైతులను కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఢిల్లీ నగరంలోకి అనుమతించేదిలేదని, పోలీసులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పంజాబ్ నుంచి వచ్చే రైతులను హర్యానా సరిహద్దుల్లోనే అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రైతులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు, ఏడు రైతు సంఘాలతో కూడిన “సంయుక్త కిసాన్ మోర్చా” నేతలు తక్షణమే చర్చలు జరపాలంటూ ప్రధానికి లేఖ రాయడంతో, ఢిల్లీ నగరంలోకి రైతులు ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది.
ఢిల్లీ శివారులోని “నిరంకారీ మైదానం” లో శాంతియుతంగా ఆందోళనను కొనసాగించాలన్న నిబంధనతో…ఢిల్లీ పోలీసులు రైతులను దేశ రాజధానిలోకి అనుమతించారు. అయితే, పదుల సంఖ్యలోనే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన “నిరంకారీ మైదానం” కు చేరుకున్నారు. చాలా పెద్ద సంఖ్యలో వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులలోని జాతీయ రహదారులపైనే బైఠాయుంచి ఆందోళనను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలో, రైతుల డిమాండ్లపై ప్రభుత్వం చర్చించేందుకు సిధ్దంగా ఉందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నిర్దేశించిన మైదానానికి రైతులు చేరుకున్న మరుసటిరోజే చర్చలు జరుపుతామని అమిత్ షా చెప్పారు.
మోడి ప్రభుత్వం రూపొందించిన మూడు “వ్యవసాయ చట్టాలను” వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు పట్టుబడుతున్నారు. డిసెంబరు 3 వ తేదీన జరిపే మరోవిడత చర్చలలో రైతు సంఘాల నేతలు పాల్గొనాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ కోరారు. అప్పటివరకూ ఎందుకు ఆగాలి, తక్షణమే చర్చలు జరపాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన లో పాల్గొనేందుకు సమూహాలుగా రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. అంతకంతకూ, ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.
ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన “అన్నదాత” లకు ఢిల్లీలోని “ఆప్” ప్రభుత్వం అండగా నిలిచింది. గుడారాలు, తాగునీరు, మరుగుదొడ్లు, దోమల నివారణ కు “ఫాగింగ్” లాంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. అలాగే, ఢిల్లీ లోని పలు గురుద్వారాల ప్రబంధక్ కమిటీ లు కూడా రైతుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టాయు. రేపటికి బురారీ లోని నిరంకారీ మైదానానికి వేల సంఖ్యలో రైతులు చేరుకునే అవకాశం ఉంది.