రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తాజాగా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు చంద్రబాబు. ఎక్కడా కూడా చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ అహింసా సిద్దాంతంతో ముందుకు వెళ్లారు. బానిసత్వం వద్దు.. స్వాతంత్య్రమే ముద్దు అని నినదించారు.. 2014 అక్టోబర్ 02న స్వచ్ఛ భారత్ కు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.
నీతి అయోగ్ లో స్వచ్ఛ భారత్ పై ఉపసంఘం ఏర్పాటు చేశారు. దీనికి నేను చైర్మన్ గా ఉన్నానని.. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. 2లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని.. ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చామని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసిందన్నారు. రోడ్ల పై 85లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ఏడాది లోపు చెత్త మొత్తం శుభ్రం చేయించాలని పురపాలక మంత్రి నారాయణను ఆదేశించినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు.