కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ఇటీవల కొత్తగా ఎన్నుకున్న ఎన్సీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా రాష్ట్రపతి పాలనను తక్షణం ఎత్తివేస్తూ కేంద్రం ఆదివారం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం కూడా చేశారు. పదేళ్ల తరువాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా అందులో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
ఈ మేరకు ఎల్జీకి ఓ లేఖను సమర్పించారు ఎన్సీ ఉపాధ్యక్షుడు, సీఎం అభ్యర్థి ఒమర్ అబ్దుల్లా.ఈ క్రమంలోనే రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది. కాగా, జమ్ముకశ్మీర్‌లో 2018లో బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమి ప్రభుత్వం కూలిపోవడంతో శాసనసభను రద్దు చేసి, 6 నెలలపాటు గవర్నర్ పాలను విధించారు.అది కాస్త ముగియడంతో కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది.2019 అక్టోబర్ 31న రాష్ట్రపాతి పాలనను పొడిగిస్తూ మరో నోటిఫికేషన్‌ను కేంద్రం జారీ చేసింది. ఇప్పటివరకు కొనసాగగా తాజాగా ఎత్తివేశారు. కాగా, 16న జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేయనున్నారు.