మహిళలపై రోజుకు 86 గంటకు 49 అత్యాచారాలు జరుగుతున్నాయంటున్న NCRB Data

-

ఇండియా డవలప్‌ అవుతోంది.. అన్ని రంగాల్లో దూసుకెళ్తుంది..అభివృద్ధిలో మనం ఎంత ముందుకు వెళ్తున్నామో.. అఘాయిత్యాలలో కూడా అంతే ముందుకు వెళ్తున్నాం..వేధింపులు, అత్యాచారాలు, హత్యలు..దేశంలో నానాటికి పెరిగిపోతున్నాయి..వీటికి బలైపోతున్న మహిళలు ఎంతో మంది. ఆడపిల్లల భవిష్యత్తు ఎప్పుడూ అంధకారంలోనే ఉండాలా..? ఏ క్షణంలో ఎవరు వచ్చి దాడి చేస్తారో అని భయపడాల్సిందేనా..ఈ ప్రశ్నలకు NCRB తాజా నివేదిక అవుననే సమాధానం ఇస్తుంది. దేశంలో జరుగుతున్న నేరాలపై ఈ ఏడాది వచ్చిన రిపోర్ట్‌ చూస్తే ఆడపిల్లలకు సమాజంలో ఎమాత్రం భద్రత ఉందో తెలుస్తుంది..

దేశంలో జ‌రుగుతున్న నేరాల‌పై ఎన్‌సీఆర్‌బీ (National Crime Records Bureau- NCRB) ఏటా ఒక నివేదిక రూపొందిస్తుంది. అందులో భాగంగా 2021, 2020, 2019 సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన నేరాల‌ను క్రోడీక‌రించి ఒక నివేదిక‌ను ఎన్‌సీఆర్‌బీ విడుద‌ల చేసింది. అంటే ఇవి అధికారికంగా న‌మోదైన వివ‌రాలు మాత్ర‌మే. లెక్క‌కు అంద‌ని నేరాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది.

మూగబోతున్న మహిళల జీవితాలు..

NCRB తాజాగా విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం దేశంలో మ‌హిళ‌ల‌పై రోజుకు స‌గ‌టున‌ 86 అత్యాచారాలు జ‌రుగుతున్నాయని తేలింది.. గంట‌కు మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న నేరాల సంఖ్య 49 అని ఆ నివేదిక తేల్చింది. NCRB కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తుంది. మొత్తంగా 2021లో మ‌హిళ‌ల‌పై 31,677 అత్యాచారాలు జ‌రిగాయి. అంటే స‌గ‌టున రోజుకు 86. అలాగే, ప్ర‌తీ గంట‌కు మ‌హిళ ల‌క్ష్యంగా జ‌రిగిన నేరాల సంఖ్య 49.

2020లో..

2020 సంవ‌త్స‌రానికి వ‌స్తే.. ఆ ఏడాది మ‌హిళ‌ల‌పై జ‌రిగిన అత్యాచారాల సంఖ్య 28046. నిజానికి అప్పుడు దేశ‌మంతా చాలా కాలం లాక్‌డౌన్‌లో ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు మాత్రం పెద్ద‌గా త‌గ్గ‌లేదు. 2021 క‌న్నా 2020లోనే రేప్‌ల సంఖ్య కొద్దిగా త‌క్కువ‌గా ఉంది. అలాగే, 2019లో జ‌రిగిన అత్యాచారాల సంఖ్య 32,033.

రాజస్థాన్‌లో మహిళల భద్రత ప్రశ్నార్థకమే..

2021లో రాష్ట్రాల వారీగా తీసుకుంటే మ‌హిళ‌ల‌పై అత్యాచారాల విష‌యంలో రాజ‌స్తాన్ మొద‌టి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 2021లో 6,337 రేప్‌లు జ‌రిగాయి. త‌రువాతి స్థానాల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌(2,947), ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(2845) ఉన్నాయి. అతి త‌క్కువ రేప్‌ల‌తో ఢిల్లీ మ‌హిళ‌ల‌కు కొంత సేఫ్ ప్లేస్‌గా నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో 2021లో 1250 అత్యాచారాలు జ‌రిగాయి.

క్రైమ్ రేటు ప‌రంగా..

మ‌హిళ‌ల‌పై జ‌రిగిన అత్యాచారాల‌ క్రైమ్ రేటు విష‌యంలోనూ రాజ‌స్తానే ముందుంది. ఆ రాష్ట్రంలో ఒక ల‌క్ష జ‌నాభాకు రేప్ క్రైమ్ 16.4%
చండీగ‌ఢ్‌లో 13.3%,
ఢిల్లీలో 12.9%,
హ‌రియాణాలో 12.3% క్రైమ్ రేట్ ఉంద‌ని NCRB వెల్ల‌డించింది.

ఈ విష‌యంలో జాతీయ స‌గ‌టు 4.8%. మొత్తంగా 2021 సంవ‌త్స‌రంలో మ‌హిళ‌ల‌పై 4,28,278 నేరాలు జ‌రిగాయి. అంటే ఇవి అధికారికంగా న‌మోదైన వివ‌రాలు మాత్ర‌మే. లెక్క‌కు అంద‌ని నేరాల సంఖ్య ఇంకా ఎక్కువే. మొత్తంగా మ‌హిళ‌ల‌పై నేరాల రేటు(ల‌క్ష జ‌నాభాకు) 64.5%. 2020లో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన నేరాల సంఖ్య 3,71,503. 2019లో ఇది 4,05,326.

మ‌హిళ‌ల‌పై జ‌రిగిన నేరాల్లో ప్ర‌ధాన‌మైన‌వి అత్యాచారం, హ‌త్య, కిడ్నాప్‌, యాసిడ్ దాడులు, వ‌ర‌క‌ట్న వేధింపులు, ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించ‌డం, బ‌ల‌వంత‌పు పెళ్లి, అక్ర‌మ ర‌వాణా, ఆన్‌లైన్ వేధింపులు. కష్టం వస్తే కాపడానికి రాష్ట్రప్రభుత్వాలు టెక్నాలజీ సాయంతో యాప్‌లు రూపొందించాయి. కానీ., పరిస్థితి తేడాగా ఉందంటే..దిశలు దశలు కాదు.. తప్పించుకునే దిశగా మన ప్రయత్నం ఉండాలి. అందుకు తగ్గట్టు..ఆడపిల్లలు పెప్పర్‌స్ప్రే లాంటివి ఎప్పుడూ పక్కన పెట్టుకుంటే.. కాస్త ధైర్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version