జైల్లో రక్షణ లేదు.. బెయిల్ ఇవ్వండి.. శ్రద్ధా హత్య నిందితుడు ఆఫ్తాబ్‌

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలా బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించాడు. జైల్లో తనకు భద్రత లేదని, బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై దిల్లీ సాకేత్‌ కోర్టు శనివారం (డిసెంబరు 17న) విచారణ చేపట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆఫ్తాబ్‌ జ్యుడిషియల్‌ కస్టడీని ఇటీవల న్యాయస్థానం డిసెంబరు 23 వరకు పొడిగించింది. ప్రస్తుతం అతడు తిహాడ్‌ జైల్లో ఉన్నాడు.

తన సహజీవన భాగస్వామి అయిన శ్రద్ధా వాకర్‌ను చంపి, ఆమె శరీరాన్ని అతి దారుణంగా ముక్కలు చేసిన ఆఫ్తాబ్‌ను దిల్లీ పోలీసులు గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే నిందితుడికి పాలిగ్రాఫ్‌, నార్కో పరీక్షలు కూడా చేశారు. శ్రద్ధా హత్య కేసులో పోలీసులు ఇంకా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయలేదు. ప్రస్తుతానికి నిందితుడిని జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు ఈ కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ఇద్దరు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లను నియమిస్తూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వీకే సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎల్‌జీ కార్యాలయ అధికారులు గురువారం వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version