మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితి బాగుండాలని మరియు పెట్టుబడులు చేయాలని ఎన్నో రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతూ ఉంటుంది. అయితే వాటిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ ను పెంచేందుకు ఎన్నో రకాల పథకాలను తీసుకురావడం జరిగింది. ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన, ఉద్యోగులకు పీపీఎఫ్, సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం, నెలవారి వడ్డీ కోసం మంత్లీ ఇన్కమ్ స్కీం ఇలా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే పీపీఎఫ్ స్కీం కూడా వీటిలో మంచి పథకం అనే చెప్పవచ్చు. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, దీనిలో కనీసం ప్రతి సంవత్సరం 500 రూపాయలను కూడా పెట్టుబడి పెట్టవచ్చు మరియు 1.50 లక్షల వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన వడ్డీ రేటు 7.10% ఉంటుంది. అంతేకాకుండా ఈ పెట్టుబడులలో ఎలాంటి రిస్క్ ఉండదు మరియు చిన్న మొత్తం నుండి పెద్ద మొత్తం వరకు పెట్టుబడులు చేయవచ్చు. వీటికి కేంద్ర ప్రభుత్వం హామీ ఉండడం వలన కచ్చితంగా రిటర్న్స్ కూడా వస్తాయి. పైగా ఏడాదికి ఒకేసారి పెద్ద మొత్తం డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్మెంట్ రూపంలో కూడా ఈ పథకంలో డిపాజిట్ చేయవచ్చు. వరుసగా 15 సంవత్సరాలు వరకు డబ్బులు పెట్టడం వలన తర్వాత ఐదేళ్లు చొప్పున పొడిగించుకోవచ్చు.
అర్హత వివరాలు:
భారతదేశంలో నివసిస్తున్న పౌరులు అందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరియు కేవలం పీపీఎఫ్ అకౌంట్ ద్వారా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులే, కాకపోతే వారి తల్లిదండ్రులు పీపీఎఫ్ అకౌంట్ ను నిర్వహించాలి.
ఎలా అప్లై చేయాలి:
కేవలం పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని పెట్టుబడులు చేయడం ద్వారా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. అయితే పీపీఎఫ్ అకౌంట్ కోసం ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, నామిని డిక్లరేషన్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఈ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను బ్యాంక్ లేక పోస్ట్ ఆఫీస్ వద్ద పూర్తి చేయవచ్చు. మీ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసి అకౌంట్ ను ఓపెన్ చేసుకొని పెట్టుబడులను ప్రారంభించడం వలన ఎటువంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ ను పొందగలరు.