తమ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని తల్లికి గుండు కొట్టించారు !

బీహార్‌లోని దర్భంగా జిల్లాలో కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయి కుటుంబం తల్లి పై దాడి చేసి తలకు గుండు కొట్టించారు. ఆమె కుమారుడు తమ కుమార్తెను అనుమతి లేకుండా వివాహం చేసుకోవడంతో వారు కోపంగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాక వారి పెళ్లి చిత్రాలను కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. అందుతున్న వివరాల ప్రకారం నవంబర్ 14 న మహిళపై దాడి జరిగిందని, బుధవారం ఈ దాడి వీడియో వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.

ఈ వీడియో ప్రకారం ఐదుగురు మహిళలతో సహా 20 మంది పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో, ఒక గుంపు మహిళను ఇంటి నుండి బయటకు లాగడం మరియు ఆమె తల గుండు చేయడాన్ని చూడవచ్చు. స్థానిక పోలీసు అధికారి అశుతోష్ కుమార్ మాత్రం గ్రామంలో మహిళను రోడ్డు మీదకు లాగి గుండు కొట్టించినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. మహిళ గుండు తనంతట తానే చేయించుకుందని ఆయన పేర్కొన్నాడు.