గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారాయి. దీనికి తోడు ఈనెల 26 నుంచి కొత్తగా 4 పథకాలను అమలుచేయాలని రాష్ట్ర సర్కార్ భావించింది. అందుకు సంబంధించి గ్రామ, వార్డు సభలు నిర్వహించి అందులో లబ్దిదారులను ఎంపిక చేయాలని అనుకున్నది. అయితే, ఈ గ్రామసభల్లో సీన్ రివర్స్ అయ్యింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలను గ్రామస్తులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మాకు పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి నుంచి ఇదే కొనసాగుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గ్రామస్తులు చుట్టుముట్టారు. మాకు పథకాలు ఇవ్వరా? అని నిలదీశారు. యాదాద్రి భువనగిరి మండలం అనంతారం గ్రామ సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేను తమకు పథకాలు రాలేదని, అర్హులకు పథకాలు ఇవ్వరా? కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా? అని నిలదీశారు.