కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించడమే టార్గెట్‌గా జాతీయ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అయితే మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న పార్టీలు చాలా ఉన్నా వాటిని కూడగట్టే శక్తి జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ఎంత మాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలోనే పలు బలమైన ప్రాంతీయ పార్టీలను ఒకే తాటిమీదకు తీసుకు వచ్చే ప్రక్రియ స్టార్ట్ అయ్యిందా ? అంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే చెపుతోంది.
జాతీయ స్థాయిలో తిరుగులేని రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కలిసి బలమైన కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. తమిళనాడులో స్టాలిన్ – మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే – పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ – ఢిల్లీలో కేజ్రీవాల్ – పంజాబ్‌లో ఆకాళీదల్ లాంటి పార్టీలను ఏకం చేస్తోన్న పీకే ఇప్పుడు మరిన్ని పార్టీలను తన కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలను చాపకింద నీరులా చేస్తోన్నారు.
ఇప్పటికే పీకే టీం సభ్యుడు రాబిన్ ఏపీలో చంద్రబాబు కోసం పని చేస్తున్నారు. చంద్రబాబు చెపితే కర్నాకటలో జేడీఎస్ కూడా జట్టుకట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మోడీని ఎలాగైనా గద్దె దించాలని పీకే చాలా బలంగా పని చేస్తున్నాడు. ఈ మహా టీంలో ఇప్పుడు టీఆర్ఎస్‌ను కూడా కలపాలని పీకే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మోడీతో ఇప్పటికే కేసీఆర్ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటోంది.
ఇక్కడ కాంగ్రెస్ ప్లేసులోకి బీజేపీ వచ్చేందుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అక్కడ కేసీఆర్‌ను గద్దె దింపడమే టార్గెట్‌గా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. మోడీని దించే మహాక్రతువులో గులాబీ పార్టీని భాగస్వామ్యం చేసేందుకే కేటీఆర్ – పీకే భేటీ అయినట్టు తెలుస్తోంది. వీరి మధ్య అంతర్గతంగా ఏం జరిగిందన్నది తెలియపోయినా కేటీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేసేందుకే రెడీ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఈ అన్ని పార్టీలను పీకే ఒకే మాట .. ఒకే బాటలోకి తీసుకు వస్తే అది జాతీయ రాజకీయాల దశ దిశను మార్చడం ఖాయం.