ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా 48 మంది పైలట్లను ఉద్యోగం నుంచి తొలిగించింది. ఈ మేరకు ఆ సంస్థ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై కలకలం రేగింది. అయితే కరోనా వైరస్ ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా పైలట్లను తొలగించాల్సి వచ్చిందని వారికి రాసిన లేఖలో తెలిపింది. తొలగించిన పైలట్లు గురువారం రాత్రి తమ సేవలను ముగించారని పేర్కొన్నది.
పైలెట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసిపిఎ) ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్‌ను కోరింది. వీరంతా గతేడాది రాజీనామా చేసి, తిరిగి వాటిని ఉపసంహరించుకున్నారు. కాగా, తొలగింపునకు గురైన పైలట్లలో కొందరు ప్రస్తుతం విధుల్లో ఉండడం గమనార్హం. అలాగే తొలగింపునకు గురైన వారు ఎయిర్‌బస్ 320 పైలట్లుగా ఉన్నారు.