ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసింది. వేతనం లేకుండా ఉద్యోగుల దీర్ఘకాల సెలవు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఆరు నెలల నుంచీ రెండేళ్ల వరకూ ఈ సెలవులు ఉండే అవకాశం ఉంది. అవసరమైతే వీటిని 5 ఏళ్ల వరకు పొడిగించే వెసులుబాటు కూడా ఉంది. సెలవులపై వెళ్లే ఉద్యోగుల జాబితాను తయారు చేసి ఆగస్టు 15 కల్లా తమ నివేదికలు సమర్పించాలని రీజినల్ డైరెక్టర్లను ఆదేశించింది. అప్పుల ఊబిలో కురుకుపోయిన ఎయిర్ ఇండియా ఖర్చులను తగ్గించుకునే దిశగా పలు ప్రయత్నాలు చేస్తున్నది.
ఇందులో భాగంగా ఈ ప్రతిపాదనకు ఆ సంస్థ బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియాను పూర్తిగా వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించింది. అయితే ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.