మహారాష్ట్రలో రాజకీయ నేతలను కరోనా చుట్టుముట్టేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కరోనా బారిన పడగా… తాజాగా సోమవారం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా కరోనా సోకింది. అజిత్ పవార్‌కు కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలోనే ఉద్ధవ్ థాకరే కరోనా బారిన పడగా.. రాజకీయ సంక్షోభం నుంచి బయటపడే దిశగా ఆయన బయటకు రాక తప్పడం లేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు ఆయన బయటకు వచ్చారు. అంతేకాకుండా తమ సంకీర్ణంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన కలుస్తున్నారు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం థాకరేను ఆయన నివాసంలోనే అజిత్ పవార్ కలిశారు. ఈ కారణంగానే అజిత్ పవార్ కరోనా బారిన పడినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు కరోనా కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. థర్డ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోర్త్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి.