తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు భక్తుల సౌకర్యార్థం 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ, దర్శన టికెట్లను ఈ నెలలో విడుదల చేయనుంది. 2 నెలల ముందుగానే జనవరి టికెట్లను టీటీడీ విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 19న ఆర్జిత సేవల కోటాను విడుదల చేయనుంది. అందులో కొన్నింటిని ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోటా కింద 21న ఉదయం 10 గంటల వరకూ భక్తులు ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశం ఉన్నది.
ఇక ఈనెల 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా జనవరి కోటా టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఫ్రీ ప్రవేశ దర్శనం కోటా టికెట్లు విడుదల కానున్నాయి. 24వ తేదీన ఉదయం 10 గంటలకు జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల కానుంది.https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు జనవరి నెలకు చెందిన అన్నిరకాల టికెట్స్ బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.