మొర ఆలకించిన కేంద్రం ఇక రాష్ట్రం వంతే మిగిలింది…

-

మము బ్రోవమని చెప్పవే.. సీతమ్మ తల్లి అంటూ ఆనాడు రామదాసు ఆర్తితో వేడుకుంటే ఆ దేవదేవుడు కరుణించాడు. మా భద్రాద్రిని పట్టించుకోరా అని కొన్నేళ్లుగా తెలుగు ప్రజలు కూడా వేడుకుంటున్నారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల మొర విన్నట్టుంది. ‘అయోధ్య రాముడి’కి ఇచ్చినంత ప్రాధాన్యం ఇవ్వకపోయినా..గుడ్డిలో మెల్ల అన్నట్లుగా రైల్వే మార్గంపై అడుగులు ముందుకు వేసింది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి రాష్ట్రంలోని భద్రాచలం మధ్య పాండురంగాపురం వరకు కొత్త రైల్వే మార్గం రాబోతోంది. దీనికి సంబంధించి సర్వే చివరి దశకు చేరుకుందని అధికారులు వెల్లడించారు.దాదాపు రూ.2800 కోట్లు ఇందుకు వ్యయం కాగలదని కూడా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమీక్ష నిర్వహించారు. అన్నీ సజావుగా సాగితే వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.ప్రస్తుతం భద్రాచలానికి వెళ్లే భక్తులు భద్రాచలం రోడ్‌ (కొత్తగూడెం) స్టేషన్‌లో దిగి, రోడ్డు మార్గం ద్వారా 40 కి.మీ. ప్రయాణించాలి. ఈ రైల్వే లైన్ సాకారమైతే నేరుగా భద్రాచలంలోనే అడుగుపెట్టే అవకాశం భక్తులకు కలగనుంది.

కొద్దికాలంగా భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధిపై అటు టీఆర్ ఎస్, ఇటు బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయోధ్య రామాయ‌ల‌ నిర్మాణానికి భారీ ఎత్తున బీజేపీ విరాళాలు సేకరించిన సందర్భంగా అధికార టీఆర్ఎస్ నేతలు అగ్గిమీద‌గుగ్గిల‌మ‌య్యారు. అయోధ్య రామాలయం కోసం విరాళాలు సేకరిస్తోన్న బీజేపీ.. భద్రాచలం రాముడి కోసం కూడా విరాళాలు సేకరిస్తుందా..? బీజేపీకి భద్రాద్రి రాముడు పట్టని వాడయ్యాడు అంటూ మండిప‌డ్డారు. బీజేపీకి ఉత్త‌రాదిపై ఉన్న ప్రేమ ద‌క్షిణాదిపై ఎందుకు ఉంటుంద‌ని చుర‌క‌లు అంటించారు. భద్రాద్రి అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందని నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలోని టూరిజం శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ రామాయణం సర్క్యూట్‌ లో భద్రాచలం రామాలయానికి చోటు దక్కకపోవడంపై కూడా తీవ్ర దుమారం రేకెత్తించింది. తెలంగాణ‌కు చెందిన కేంద్ర మంత్రి తెలంగాణ‌లోని రాములోరి గుడికి ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇక బీజేపీ వారు కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. 2016లో సీతారాముల క‌ల్యాణానికి భ‌ద్రాచ‌లం వ‌చ్చిన సీఎం కేసీఆర్.. ఆల‌యాభివృద్ధి కోసం ఆ ఏడాది బ‌డ్జెట్‌లోనే రూ.100 కోట్లు కేటాయిస్తామని మాటిచ్చారని, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేద‌ని నిలదీశారు.దక్షిణ అయోధ్యగా తీర్చిదిద్దుతామని చెప్పారని, కానీ ఆ విష‌యంలో ఒక్క అడుగూ ప‌డ‌లేద‌ని పేర్కొన్నారు. ఒకే ఒకసారి రాములోరి కల్యాణోత్సవానికి వచ్చిన సీఎం ఆ తర్వాత ఎందుకు రాలేదని, ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి తలంబ్రాలు సమర్పించాల్సి ఉన్నా దానికి భిన్నంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఎవరు రాముడిపై శీతకన్ను వేశారో అర్థమవుతోందా? అంటూ మండిపడ్డారు.

ఈ రాజకీయాలు పక్కనపెడితే.. రెండు ప్రభుత్వాలూ తమ రాముడిని పట్టించుకోకపోవడాన్ని జిల్లా వాసులు, రామ భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా..భద్రాచలం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంది. రామాలయ సందర్శనతోపాటు పర్ణశాల, పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్, జింకల పార్కు, పాపికొండలు.. ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు ఇక్కడెన్నో ఉన్నాయి.ఎట్టకేలకు భద్రాద్రికి రైలును కేంద్రం తీసుకురానున్నందున.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దినట్లుగా భద్రాద్రిని తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version