తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణల వ్యవహారం చల్లారక ముందే.. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలపైనా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆధారాలతో సహా ప్రెస్‌మీట్లు పెడుతూ.. ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఈటల వ్యవహారంలో జెట్ స్పీడ్ విచారణ జరిపించినట్టు సీఎం కేసీఆర్ వారిపైన కూడా విచారణ జరపాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా మొన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ నవీన్‌రావు, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. లైవ్ లో తన దగ్గర ఉన్న ఆధారాలను చూపించి వీటిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ సంతోష్, ఎమ్మెల్యే వివేకానంద, సునీత, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. వాటి వివరాలు కూడా మీడియాలకు వెల్లడింంచారు. ఇక నిన్న రేవంత్ రెడ్డి కూడా దేవరయాంజాల్ లో మంత్రి మల్లారెడ్డి భూ కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టారంటే ఆరోపించారు.
ఇక వీరు చేసిన ఆరోపణలపై కూడా టీఆర్ ఎస్ నేతలు వివరణ ఇవ్వడం ఇక్కడ అనుమానాలకు దారి తీస్తుంది. ఇంతకు ముందు పెద్దగా పట్టించుకోని టీఆర్ ఎస్ నేతలు.. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. మొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సునీత ఇదే విధంగా వివరణ ఇచ్చారు. నిరూపిస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ సవాల్ విసిరారు. ఇక నిన్న రాత్రయితే ఓ ఛానల్ లో మంత్రి మల్లారెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డితోనే లైవ్ డిబేట్ లో పాల్గొని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మరి ప్రతిపక్షాలు వీరి సవాల్ ను స్వీకరిస్తాయా లేదా చూడాలి.