కరోనా బారిన పడి హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్న పేషెంట్లకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలను వాడుకునేందుకు అనుమతివ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్న కోవిడ్ పేషెంట్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, అందువల్ల వారిని స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లను వాడుకునేందుకు అనుమతిస్తే వారు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకుంటారని.. దీంతో వారికి ధైర్యం లభిస్తుందని.. కేంద్రం పేర్కొంది.
ఇక ఇదే విషయమై కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) డాక్టర్ రాజీవ్ గార్గ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖ రాశారు. అయితే అనేక రాష్ట్రాల్లో కోవిడ్ పేషెంట్లను స్మార్ట్‌ఫోన్లు వాడుకునేందుకు అనుమతులు ఇస్తున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అందుకు అనుమతించడం లేదు. దీంతో వారి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా తెలంగాణలో గతంలో కోవిడ్ హాస్పిటళ్లలో చికిత్స తీసుకున్న పలువురు చనిపోయే ముందు తీసిన సెల్ఫీ వీడియోలపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ విషయమై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హాస్పిటళ్లలో ఉండే కోవిడ్ పేషెంట్లకు స్మార్ట్‌ఫోన్లను వాడుకునేందుకు అనుమతి ఇస్తే ఇలా వీడియోలు తీసి పెడతారా ? అని కూడా అసహనం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో కోవిడ్ హాస్పిటళ్లలో పేషెంట్లకు స్మార్ట్‌ఫోన్లను వాడుకునేందుకు ఇప్పటికీ అనుమతిస్తున్నారా, లేదా.. అన్న విషయం మాత్రం తెలియడం లేదు.