రాజకీయ కాక రేపుతున్న రాజధాని..వైసీపీ vs బీజేపీ

-

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలపై వైసీపీ విరుచుకుపడుతోంది. బీజేపీవి ద్వంద్వ ప్రమాణాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. సోము వీర్రాజుకు చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకు రావాలని సవాల్ విసురుతున్నారు. బీజేపీ,వైసీపీ నేతల మాటల తూటలతో రాజధాని అంశం మళ్లీ ఏపీలో రాజకీయ కాక రేపుతుంది.

ఏపీ ప్రజలకు అమరావతిలో అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుంది. మూడు రాజధానులకు మేం వ్యతిరేకం. రెండో ఆలోచనే లేదు. అమరావతే రాజధాని అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో సంచలనం రేపాయి. వీర్రాజు వ్యాఖ్యల్ని టీడీపీ స్వాగతించింది. ఆంధ్రులకు అమరావతే రాజధానిగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీలన్నీ అమరావతికి మద్దతిస్తుంటే.. సీఎం జగన్ మాత్రం మూడు రాజధానులంటూ వితండంగా వాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అధికారంలోకి రాగానే అద్భుతమైన రాజధాని నిర్మిస్తామమన్న సోము వీర్రాజు కామెంట్స్‌పై అధికార పార్టీ నేతలు భగ్గుమన్నారు. బీజేపీది డబుల్‌ స్టాండ్‌ అంటూ విమర్శలు చేశారు. అమరావతిలో భూ సేకరణ స్కామ్‌ అన్నారా? లేదా? అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును నిలదీశారు వైసీపీ నేతలు.రాజధాని విషయంలో టీడీపీదంతా డ్రామా అని కొట్టిపారేశారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు ..కేవలం 29 గ్రామాల నాయకుడిగా మారారని విమర్శించారు.

రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని కేంద్రం హైకోర్టులో అఫిడవిట్ వేసిందని.. ఇప్పుడు బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. 13 జిల్లాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయమని చెప్పారు. ప్రజలకు ఏది మంచిదైతే అదే చేస్తామన్నారు.

ఏపీ రాజధాని విషయంలో నిన్నటి వరకూ బీజేపీ అయోమయంలో ఉన్నా.. సోము వీర్రాజు ప్రకటనతో క్లారిటీ వచ్చింది. బీజేపీ అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించడంతో.. ఆ ప్రాంత రైతుల్లో ఉత్సాహం వచ్చింది. అమరావతిపై అధికార విపక్షాల మధ్య జరుగుతున్న డైలాగ్ వార్‌ ఏ దిశగా మళ్లుతుందనే దాని కంటే ఎలా ముగుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version