కమల హాసన్ ప్రకటన సంచలనంగా మారింది. రజనీకాంత్ పార్టీతో పొత్తుకు సిద్ధమని, ఇద్దరి మధ్య స్నేహం అలాగే ఉందని, రజనీ ఒక ఫోన్ కాల్ చేస్తే తాను పలుకుతానంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగబోతున్నాయి. ఇప్పటికే కమల్ తన ప్రచారాన్ని మొదలు పెట్టినంత ఊపులో ఉన్నాడు. అటు రజనీ పార్టీ ప్రకటన కూడా వచ్చింది. దీంతో తమిళ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.
రజిని దక్షిణాది సూపర్ స్టార్.. కమల్ లోక నాయకుడు. ఈ ఇద్దరు కలిస్తే అది మామూలు సంచలనం కాదు. పైగా రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలిత లేకుండా మొదటిసారి తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, రజనీకాంత్, కమల్ హాసన్ ఏ మేరకు ప్రభావం చూపుతారనే విషయం ఆసక్తిగా మారింది.2018లో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని ప్రారంభించి 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. పార్టీ ప్రకటన చేసినప్పటికీ రజిని ఎజెండా ఇంకా స్పష్టంగా తెలియదు, పార్టీ ఎజెండా విషయాలు బయటకు వచ్చాక పొత్తు సంగతి నిర్ణయిస్తామంటున్నారు కమల్.
నిజానికి ఇద్దరు తమిళ స్టార్ల మధ్య ఎప్పుడూ సత్సంబంధాలే ఉన్నాయి. ఒకరు క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ క్లిక్ అయితే, మరొకరు మాస్ బాటలో హిట్ అయ్యారు. ఈ ఇద్దరూ కలిస్తే మొత్తం తమిళనాడే ఒక్కటవుతుందా అని సగటు అభిమాని భావించటంలో ఆశ్చర్యం లేదు.అయితే వ్యక్తులుగా ఎలాంటి సంబంధాలున్నప్పటికీ, రాజకీయంగా కమల్ పక్కా బిజెపి వ్యతిరేకి. రజిని ఈ విషయంలో క్లారిటీ లేకపోగా, కాస్తో కూస్తో బిజెపికి దగ్గరనే అభిప్రాయాలున్నాయి. ఓ దశలో ఆయన బిజెపిలో చేరతారనే వాదన కూడా వినిపించింది. తమిళనాట పాగావేసే ప్రయత్నాల్లో ఉన్న బిజెపి రజనీని ఆయుధంగా వాడుకుంటుందనే అభిప్రాయాలు వినిపించాయి.
అయితే ఈలోపే రజిని తాను సొంతంగా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు కమల్ ప్రకటనతో తమిళ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. దీనికి రజిని ఎలా స్పందిస్తారో చూడాలి.