అమెజాన్ వెబ్‌సైట్‌లో విక్రయానికి ఉంచిన డోర్‌మ్యాట్‌లు, టాయ్‌లెట్ కవర్‌లపై సిక్కు మతస్థులకు అత్యంత పవిత్రమైన స్వర్ణ దేవాలయం చిత్రాలు దర్శనమివ్వడం వివాదానికి దారితీసింది. బాత్ రూమ్ రగ్గులు, డోర్ మ్యాట్లపై హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించి ఆన్ లైన్ మాధ్యమంగా విక్రయిస్తున్న అమెజాన్ ను బాయ్ కాట్ చేయాలంటూ ట్విట్టర్ లో ఓ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ అవుతోంది. ఈ తరహా ప్రొడక్టులతో భారత సంస్కృతి, సంప్రదాయాలను అవమానిస్తున్నారంటూ వేలాది మంది అమెజాన్ పై మండిపడుతున్నారు. అయితే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమీటీ(ఎస్‌జీపీసీ).. అమెజాన్ తీరుపై మండిపడింది.
ఈ ఘటనపై అమెజాన్‌కు ఎస్‌జీపీసీ ప్రెసిడెంట్ గోబింద్ సింగ్ లొంగోవాల్ శనివారం లీగల్ నోటీసులు పంపించారు. ఇలా చేయడం దైవదూషణతో సమానమని వ్యాఖ్యానించిన ఆయన.. అమెజాన్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, గతంలోనూ ఆ కంపెనీ ఇలాంటి చర్యలకు దిగి ఆ తరువాత క్షమాపణలు కోరిందని ఆయన గుర్తు చేశారు. మళ్లీ అమెజాన్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సిక్కు మతస్థులందరూ అమెజాన్ వైఖరిని ఖండిస్తూ..ఆ కంపెనీని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇక చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టుగా, వివాదానికి కారణమైన దేవతా చిత్రాలున్న మ్యాట్స్, బాత్ రూమ్ రగ్గులను తొలగిస్తున్నట్టు పేర్కొంది.