ప్రపంచమంతా కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడానికి చైనానే కారణమని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా డ్రాగన్ దేశ యాప్ లను బ్యాన్ చేయాలని భావిస్తున్నది. చైనా యాప్ లను నిషేధించాలని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో తెలిపారు. టిక్ టాక్ తో సహా అన్ని రకాల యాప్ లను బ్యాన్ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
కాగా, ఇప్పటికే చైనాకు చెందిన 59 సోషల్ మీడియా యాప్ లను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, మన దేశం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతిస్తున్నామని పేర్కొనడమే కాకుండా, తాము కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. మరి ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందో వేచిచూడాలి.