కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సీఎం జగన్ సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాలపాటు అమిత్ షాతో జగన్ సమావేశం కొనసాగింది. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికొద్ది సేపట్లో నేరుగా ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరనున్నారు. గురువారం జగన్ ఢిల్లీకి వెళ్లారు. తొలుత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని మోదీని కోరారు సీఎం జగన్.
గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న జగన్ దాదాపు 45 నిమిషాల పాటు మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ. 32,625 కోట్లు రావాల్సి ఉందని వినతి పత్రంలో తెలిపారు. అలాగే రుణ పరిమితి లో 17,928 కోట్లు కోత విధించారని, దీనిని సరిదిద్దాలని కోరారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ. 55,467 కోట్లకు ఖరారు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు. కాగా నేడు అమిత్ షాతో భేటీ ముగించుకొని ఆయన విజయవాడకు బయలుదేరారు.