ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసిన అమిత్ షా

-

కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో నిన్న నిర్వహించిన బీజేపీ బూత్‌స్థాయి విజయసంకల్ప యాత్రను అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. దేశ భక్తులు కావాలో, దేశాన్ని ముక్కలు చేసేవారు కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికలకు ముందు కానీ, తర్వాత కానీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమన్నారు. మొత్తం 224 స్థానాల్లోనూ పోటీ చేస్తామని, 150కిపైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, జేడీఎస్‌లు ఒకే నాణేనికి రెండు ముఖాలని విమర్శించారు. అలాగే, బెంగళూరులోని ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించిన అమిత్ షా. సరిహద్దులో ఐటీబీపీ ఉండగా దేశ భూభాగంలో ఒక్క అంగుళాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరని అన్నారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో వారు సరిహద్దులను కాపాడుతున్నారన్న కేంద్రమంత్రి వారిని హిమవీరులుగా అభివర్ణించారు. వారికి పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి పురస్కారాల కంటే హిమవీర్ బిరుదు చాలా పెద్దదని అమిత్ షా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version