అమరావతి : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. గురుపూర్ణమి సందర్భంగా ఇవాళ తాళ్లాయపాలెం శివస్వామి ఆశ్రమానికి వచ్చారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అయితే… అమరావతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుదించడం పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. వెల్లంపల్లి దేవాదాయ మంత్రి అయ్యాక దేవాలయాల పై దాడులు పెరిగాయి అంటూ నినాదాలు కూడా చేశారు.
తమ వినతి పత్రం తీసుకోక పోవడం తో మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అమరావతి రైతులు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ…. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు రైతులు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం.. చేసి అమరావతి రైతులను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు దారుణంగా వ్యవహరించారని అమరావతి రైతులు నిప్పులు చెరిగారు. మహిళలను మగ పోలీసులు తోసేయ్యడం పై అభ్యంతరం తెలిపారు అమరావతి మహిళా రైతులు. ఆ పోలీసులను కూడా విధుల నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేశారు.