ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి పదేపదే కుల ప్రస్తావన తేవడం బాధాకరమని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజికవర్గంపై ఎందుకంత కక్ష? అని ఆయన ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గం వారు డాక్టర్లు, పోలీసులు, వ్యాపారవేత్తలు, రైతులుగా ఉండకూడదా? అని ప్రశ్నించిన ఆయన స్వర్ణా హోటల్ ప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్‌ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అలానే రాయపాటి కోడలు మమతను విచారణ పేరుతో వేధిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి నుంచి, తమ ప్రభుత్వ అవినీతి నించి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని అనగాని విమర్శించారు. దళితులు అధికంగా ఉన్న అమరావతిని కమ్మరావతి అంటూ ప్రచారం చేసి దానిని చంపేస్తున్నారని అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను ఈరోజు అనాధల్లా రోడ్డున పడేశారని ఆయన విమర్శించారు. ఇప్పటికి అయిన ముఖ్యమంత్రి కుల జాఢ్యాన్ని వదిలి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అనగాని సత్యప్రసాద్ కోరారు.