సీఎం జగన్ మొన్నటి వరకు పరదాల చాటున తిరిగారని.. ఇప్పుడు బయటికీ వస్తే.. ప్రజలు పారిపోతున్నారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎద్దేవా చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడి కత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు వివేకాహత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని ఆలోచిస్తున్నారు. మద్యం, ఇసుకలో దోచుకున్న సొమ్ములు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్ లో తరలిపోతున్నాయి. డబ్బుతో ఓట్లు కొనాలనుకుంటున్నారని ఆరోపించారు.
తమది విజన్.. జగన్ పాయిజన్ అన్నారు. మూడు రాజధానులు చేశానని ఆయన చెబుతున్నారు.. కర్నూలు న్యాయ రాజధాని అయిందా? వైకాపా పాలనలో అన్ని వర్గాలూ నష్టపోయాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ 102 ప్రాజెక్టులన్నీ రద్దు చేశారు. నేను రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను పరుగెత్తించా. వైకాపా ప్రభుత్వం ఖర్చుపెట్టింది రూ.2 వేల కోట్లు మాత్రమే. జాబ్ క్యాలెండర్ అంటూ యువతను మోసం చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను నిలువునా ముంచారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అన్నారు చంద్రబాబు.