బీజేపీ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోంది : కాంగ్రెస్

-

రూ. 1823 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు రావడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్ సభ ఎన్నికలకు ముందు తమ పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఐటీ శాఖను ఉపయోగించుకుని కాంగ్రెస్ సహా భావసారూప్యత కలిగిన విపక్ష పార్టీలను కాషాయ పార్టీ లక్ష్యంగా చేసుకుంటోందని.. ఈ పన్ను ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది. ఐటీ శాఖ నుంచి వచ్చిన తాజా నోటీసులపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

‘పన్ను చట్టాలను భాజపా తీవ్రంగా ఉల్లంఘిస్తోంది. అందుకు ఆ కాషాయ పార్టీ నుంచి రూ.4600 కోట్లు వసూలు చేయాలి. అసంబద్ధ కారణాలతో పాత రిటర్నులను తిరిగి తెరిచి కాంగ్రెస్ పార్టీపై ఐటీ శాఖ దుష్ప్రచారానికి ‘పాల్పడుతోంది’ అని అజయ్ మాకెన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకునేందుకు ఐటీశాఖను బీజేపీ పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందన్నారు.

‘ఎలక్టోరల్ బాండ్ల స్కాంను ఉపయోగించి భాజపా రూ. 8200 కోట్లు వసూలు చేసింది. పన్ను ఉగ్రవాదం లో ఆ పార్టీ నిమగ్నమైంది. కాంగ్రెస్ ను ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రయత్నం జరుగుతోంది. కానీ, మేం భయపడే ప్రసక్తే లేదు’ అని జైరాం రమేశ్ స్పష్టం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని కొనసాగిస్తుందని, పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version