2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి, గాజువాక రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సారి పిఠాపురం సెగ్మెంట్ నుండి బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. పిఠాపురంలో గెలిచి పవన్ అసెంబ్లీలో అడుగు పెడతారా.. గెలిస్తే ఎన్ని ఓట్ల మెజార్టీ సాధిస్తారు..? అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ గెలుపుపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకులు గోనే ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో జనసేన పవన్ అధినేత పవన్ కల్యాణ్ గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
దాదాపు 50 నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసమే జనసేన సీట్లు త్యాగం చేసిందన్నారు. చివరి నిమిషంలో పవన్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఎంపీగా గెలిస్తే పవన్ సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కూడా గోనే ప్రకాష్ రావు తన అభిప్రాయం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యమని తేల్చి చెప్పారు. కూటమికి 130 నుండి 145 స్థానాల వరకు వస్తాయని ఆయన అంచనా వేశారు. రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలకు గానూ 19 నుండి 21 ఎంపీ సీట్లను కూటమి కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు.