హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారిన దిశ హత్యోదంతం తరువాత దేశవ్యాప్తంగా జీరో ఎఫ్‌ఐర్‌ను అమలు చేయాలనే డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. బాధితులు న్యాయం చేయాలని వస్తే ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా సరే.. వారి నుంచి ఫిర్యాదును స్వీకరించి ఆ తరువాత ఆ ఫిర్యాదును నిర్ణీత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసేందుకు ఉపకరించే జీరో ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే అమలు చేయాలని యావత్ దేశ ప్రజలు నినదిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇకపై అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జీరో ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో ఏపీలో త్వరలో జీరో ఎఫ్‌ఐఆర్ అమలులోకి రానుంది.
దిశ అత్యాచారం, హత్య ఘటన సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే మా పరిధి కాదంటే మా పరిధి కాదని వారిని పంపివేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఏపీ ఈ విధానాన్ని త్వరలోనే అక్కడ ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు చేయనుంది.