ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడు యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైఎస్ ఛాన్సలర్స్ ల రాజీనామాలు చేయంటూ విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.
గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారంటూ యూనివర్సిటీల ముందు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వీసీలు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలు యూనివర్సీటీల వీసీలు రాజీనామా చేశారు.
తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ బాజ్జీ రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా గవర్నర్ నజీర్‌కు పంపారు. తమ రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జేఎన్‌టీయూ వీసీ జీవీఆర్ ప్రసాదరాజు రాజీనామా చేశారు. గత 4 సంవత్సరాలుగా ఆయన వైసీపీ నాయకులతో అంటకాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రసాదరాజు రాజీనామా చేశారు. ఈ లేఖను గవర్నర్‌కు పంపారు. అటు కడప ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీ ఆంజనేయ ప్రసాద్ రాజీనామా లేఖను ఉన్నత విద్యామండలితో పాటు గవర్నర్‌కు ఫ్యాక్స్ చేశారు.