ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైస్సార్సీపీ అరాచక పాలనపై తన పోరాటం ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయన నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర 18వ రోజున చినరాజకుప్పం నుంచి ప్రారంభం కానుంది. పుత్తూరు బహిరంగసభలో లోకేశ్ పాల్గొననున్నారు.
17వ రోజున గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కొత్తూరు నుంచి నగరి నియోజకవర్గం చినరాజకుప్పం వరకు 17.7 కిలోమీటర్ల మేర సాగింది. దారి పొడవునా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, సమస్యల్ని ఆరా తీస్తూ లోకేశ్ ముందుకు సాగారు. సీఎం జగన్ వ్యవస్థలంటినీ ధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేసి వైఎస్సార్సీపీ సర్కార్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
“స్టూల్ తీసేస్తే ఇల్లు ఎక్కి మాట్లడుతా. అది కాకపోతే మా నాయకుల భుజలపై ఉండి మాట్లడుతా. చైతన్యం తీసుకువస్తున్నాను కాబట్టే అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయినా పర్వాలేదు పోరాడుతా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరలు పెరగలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. ఉద్యోగాలు వచ్చాయి.” -నారా లోకేశ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి