మార్చి నెలలోనే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. ఏపీలో వడగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు చేరాయి. సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.
ఏపీలోని ప్రకాశం జిల్లా కొమరోలు, నంద్యాల, కమలాపురంలో అత్యధికంగా 42.5 డిగ్రీలు.. ఎస్ కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42 డిగ్రీలు.. కర్నూలు జిల్లా కొసిగి, శ్రీకాకుళం జిల్లా మిళియాపుట్టు, సత్యసాయి జిల్లా తాడిమర్రి, సబ్బవరం, వీరఘట్టంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.
ఇక అనంతపురం జిల్లా గుంతకల్లు, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, తిరుపతి, నెల్లూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు చిత్తూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ఏలూరు తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవ్వుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు.