ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉండడంతో టీడీపీ – జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఆదివారం నాడు రెండు దఫాలుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మధ్యలో సీట్ల సర్దుబాటుపై ఏకాంత చర్చలు జరిగాయని, రెండు పార్టీల మధ్య పొత్తును విచ్ఛిన్నం చేయడానికి సాక్షి దినపత్రికలో ఎన్నో అడ్డగోలు కథనాలు రాసినప్పటికీ, డఫ్ఫా జఫ్ఫా లాంటి సలహాదారులు ఇచ్చిన సలహాలతో పవన్ కళ్యాణ్ గారిని ఆయన సొంత కులానికి చెందిన నాయకులతో తిట్టించినా అటు తెదేపా, ఇటు జనసేన నాయకత్వం కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయని తెలిపారు.
ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలకు అధినేతలైనప్పటికీ, ప్రజలను ఒక రాక్షసుడి బారీ నుంచి బయటపడేయాలని, దాని కోసం ఎటువంటి చాన్స్ తీసుకోవద్దనే సదుద్దేశంతో రాజకీయాలకతీతంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మానవ మాతృలే… తమని ప్రత్యర్ధులు ఎంతగా విమర్శించినా ప్రజల కోసం ఆ బాధను పంటి బిగువున అదుముకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్న విధానం హర్షనీయం అని, ప్రజలు ఈ ఇద్దరు నాయకులకు రుణపడి ఉండాలని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలను చేసుకోగలరని, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ పాల ఫ్యాక్టరీని నిర్వహించుకోగలరని, అయినా ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం వారికి ఏముందని అన్నారు.