మద్యం, ఇసుకతో పాటు విద్యాశాఖలో భారీ అవినీతి : నాదెండ్ల

-

మద్యం, ఇసుకలో మాత్రమే అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. కానీ, పేద విద్యార్థుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను కూడా వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాంకు, కేంద్రం నుంచి విద్యాభివృద్ధికి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని వివరించారు. జగ్గన్న విద్యా కిట్లలో రూ.120 కోట్ల అవినీతి జరిగిందని, ఆ నిధులను ఉత్తరాంధ్ర, తాడేపల్లి, రాయలసీమ ప్రాంతానికి తరలించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించిందని తెలిపారు.

అమ్మ ఒడిలో కూడా మోసం జరిగింది. స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక్కో విద్యార్థి రూ.1000 చొప్పున ఇచ్చారు. ఆ నిధులు రూ.180 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు చెల్లించలేదు. సమగ్ర శిక్ష అభియాన్ కింద రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు రూ.700 కోట్ల ఎయిడ్ ఇచ్చింది. కేంద్రం, ఇతర సంస్థల నుంచి రాష్ట్రానికి రూ.6వేల కోట్లు వచ్చాయి. ఏడాదిలోనే కార్యక్రమాలు పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు. 27 నెలలు పూర్తయినా కార్యక్రమంలో పురోగతి లేదు. నాడు, నేడు రెండో విడతలో 13,860 అదనపు పాఠశాల గదులు నిర్మిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు 612 అదనపు పాఠశాల గదులు మాత్రమే పూర్తయ్యాయి. పాఠశాలల్లో 6,001 ప్రహరీల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు 600 ప్రహరీలు మాత్రమే పూర్తయ్యాయి.

రాష్ట్రంలో 23,221 పాఠశాలలకు గాను.. 1,174 స్కూళ్లలోనే సౌకర్యాలు కల్పించారు. విద్యాశాఖలో కనీసం 10% పనులు పూర్తి చేయలేదు. స్వేచ్ఛ విద్యాలయ కార్యక్రమాం కింద కేంద్రం నిధులు ఇచ్చింది. పాఠశాలల్లో 49,293 మరుగుదొడ్లు పూర్తి చేసినట్టు నివేదిక ఇచ్చారు. కేంద్రం, ఇతర సంస్థల నుంచి వచ్చిన రూ.6 వేల కోట్లలో రూ.3,747 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేసి తప్పించుకునే సీఎం జగన్.. ఈ అంశాలపై స్పందించాలి. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version