ఏపీలో విపక్ష టీడీపీలో వరుస పెట్టి వికెట్లు పడిపోతున్నాయి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ పంచన చేరిపోయారు. ఇప్పుడు ఐదో ఎమ్మెల్యే కూడా సైకిల్ దిగేందుకు రెడీ అవుతున్నారట. అయితే సదరు ఎమ్మెల్యే వైసీపీకి పాతమిత్రుడే. ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారుతున్నారన్న వార్తలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేసేశారు.
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న రవి సీనియరే అయినా… ( అప్పటకి మూడుసార్లు) టీడీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్నారు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు జగన్ మంచి ప్రయార్టీ ఇచ్చారు. ఇక ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రవికి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాలినేనికి రవి వీరు కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచే ఆర్థికంగా ఎప్పుడు కావాలన్నా సాయం చేసేవారని ప్రకాశం జిల్లా టాక్..?
గతంలో రవి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాడు టీడీపీ ప్రభుత్వం ఆయనకు ఉన్న కోట్లాది రూపాయల గ్రానైట్ వ్యాపారాలను టార్గెట్ చేయడంతోనే ఆయన పార్టీ మారిపోయారు. ఇప్పుడు రవి టీడీపీ ఎమ్మెల్యేగా ఉండడంతో వైసీపీ ప్రభుత్వం కొద్ది నెలలుగా ఆయన గ్రానైట్ వ్యాపారాలను టార్గెట్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తోంది. మరోవైపు ఈ దాడులు భరించలేకే మాజీ మంత్రి అయిన సిద్ధా రాఘవరావు ఫ్యామిలీ వైసీపీలోకి జంప్ కొట్టేసింది.
ప్రకాశం జిల్లాలో కోట్లాది రూపాయల గ్రానైట్ వ్యాపారాలు సిద్ధా రాఘవరావు, గొట్టిపాటి రవికే ఉన్నాయి. సిద్ధా కుటుంబం వైసీపీలో ఉండడంతో వాళ్లకు ఇబ్బంది లేదు. ఇక ఇప్పుడు రవి టీడీపీకి ఆర్థికంగా బలమైన నేతగా ఉండడంతో పార్టీ నుంచి దూరం చేసే ప్రక్రియ స్టార్ట్ అయ్యిందంటున్నారు. ఇవన్నీ భరించలేకే తన మిత్రుడు అయిన మంత్రి బాలినేని గైడెన్స్‌తోనే రవి వైసీపీ సానుభూతిపరుడు అయిన ఎమ్మెల్యే అవతారం ఎత్తేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయమై బాలినేని, రవి మధ్య పలు విడతలుగా చర్చలు జరిగాయంటున్నారు. అయితే అద్దంకి సీటు తనకు ఇవ్వడంతో పాటు అక్కడ కరణం ఫ్యామిలీ వేలు పెట్టకుండా హామీ ఇవ్వాలని రవి కోరగా అందుకు బాలినేని కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారంటున్నారు. అదే జరిగితే కరణం ఫ్యామిలీ చీరాలకే పరిమితం కావాలి. ఏదేమైనా రవి టీడీపీకి గుడ్ బై చెప్పే టైం తొందర్లోనే ఉందని క్లారిటీ వస్తోంది.