లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి

-

విశాఖ: లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి నెట్‌లో పెడతామని బెదిరింపులకు గురి చేశారు లోన్ యాప్ నిర్వాహకులు. కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్‌(30) బిర్లాకూడలి ఏరియాలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

డిగ్రీ వరకు చదివి ఓ ప్రయివేట్‌ సంస్థలో పనిచేస్తున్నాడు హేమంత్. గతంలో హేమంత్‌ తన అవసరాల కోసమని ఓ లోన్‌ యాప్‌లో కొంత మొత్తం రుణం తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సక్రమంగా చెల్లించలేకపోయాడు. దీంతో లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఎక్కువయ్యాయి. వెంటనే బాకీ చెల్లించాలని, లేదంటే తమ వద్దనున్న మీ ఫొటోలన్నీ నెట్‌లో పెడతామని, మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో మనస్థాపానికి గురైన హేమంత్‌ బుధవారం ఇంట్లో చెప్పి బిర్లాకూడలి ప్రాంతంలో ఉన్న ఓ స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ మద్యం తాగిన హేమంత్‌ రాత్రి స్నేహితులు ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందాడు. కుమారుడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకొన్న తండ్రి గున్న శ్రీనివాసరావు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీఐ ఎన్‌.సాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version