వరద బాధితులకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నాం. 2 హెలీకాప్టర్లు ద్వారా ఆహారాన్ని పంపిణీ చేశాం. నీటి సరఫరా పునరుద్దరించాం.. కానీ రెండు రోజుల పాటు కుళాయి నీటిని వాడొద్దు అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు. కుళాయి నీటిని కేవలం వేరే అవసరాలకే వాడాలి. వరద సాయంపై నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తీసుకుంటున్నాం. వరద సాయంపై ప్రజలూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. అవసరమైతే వేరే రాష్ట్రాల నుంచి ఫైరింజన్లు తెచ్చి శానిటేషన్ కార్యక్రమం చేపడతాం. అపార్టుమెంటుల్లో ఉండే నీటిని మోటార్ల ద్వారా తోడించేందుకూ చర్యలు చేపడుతున్నాం.
దాదాపు చాలా చోట్ల విద్యుత్ పునరుద్దరించాం.నీటి మునక ఉన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల విద్యుత్ పునరుద్దరణ కాలేదు. ముంపు ప్రాంతాల్లో కరెంట్ బిల్లుల వసూళ్లను వాయిదా వేస్తున్నాం. మూడు రోజుల్లో బియ్యం సహా నిత్యావసరాలు, కూరగాయల కిట్ అందచేస్తాం. 80 వేల మందికి నిత్యావసరాల కిట్ అందచేస్తాం. నూడుల్స్, ఆపిల్స్, మిల్క్, వాటర్ బాటిళ్లు అందచేస్తాం. మూడు రోజుల్లో నిత్యావసరాల కిట్ల పంపిణీ పూర్తి చేస్తాం. అలాగే రూ. 2, రూ. 5, రూ. 10కే కూరగాయలు దొరికేలా చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు అన్నారు.