ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పెద్ద గుదిబండ లా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న మేరకు సాపిగా సాగి పోవాలంటే ఖచ్చితంగా కేంద్రం మద్దతు ఉండి తీరాల్సిందే. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు కొర్రీలు పెడుతుండటం, ఇప్పుడు పూర్తిగా కేంద్రం చేతులెత్తేసిన పరిస్థితి రావడం, వైసీపీ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగిస్తోంది. మొన్నటి వరకు వైసిపి ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి ఏ అవసరం వచ్చినా, జగన్ ఆదుకునేవారు. అయితే ఏపీకి అత్యంత కీలకమైన , వైసీపీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం ఇబ్బంది పెడుతున్నట్టు వ్యవహరిస్తోంది.
మొత్తం ఈ వ్యవహారంలో దోషిగా జగన్ కనిపిస్తుండడంతో , వైసీపీ కాస్త కంగారు పడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో జగన్ కంగారుపడుతున్నారు. బిజెపి అవసరం జగన్ చాలానే ఉంది. అయినా ఈ విషయంలో మాత్రం జగన్ మౌనంగా ఉంటే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అందుకే నష్టనివారణ చర్యల్లో భాగంగా జగన్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కి ఏడు పేజీల లేఖ సైతం రాశారు. ఆ లేఖలో పోలవరం ప్రాజెక్టు కుు సంబంధించిన అన్ని వివరాలు సమగ్రంగా పేర్కొన్నారు . కేంద్రం నుంచి 40 వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని, జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇది లేఖలతో తేలే వ్యవహారం కాకపోవడంతో, ఢిల్లీకి వెళ్లి ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారనే వార్తలు ఇప్పుడు జోరందుకున్నాయి.ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే జగన్ ప్రధానిని కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఎన్డీఏ లో చేరవలసిందిగా ప్రధాని జగన్ నుు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు జగన్ ఏ క్లారిటీ ఇవ్వలేదు. ఆ తరువాత ని పోలవరం వ్యవహారంలో కేంద్రం ఈ విధంగా చేయడంతో మరోసారి ప్రధానిని కలిసి పోలవరం విషయంలో సీరియస్ గా చర్చించాలి అనే ఆలోచన లో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ప్రధాని అపాయింట్మెంట్ సంపాదించే పనిలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ప్రధాని అపాయింట్మెంట్ దొరకకపోయినా , పోలవరం విషయంలో బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోయినా, సీరియస్ గానే వ్యవహరించాలని , ఏమాత్రం వెనుకడుగు వేయకూడదు అనే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది . ఏది ఏమైనా ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య ఉన్న సానుకూల వాతావరణాన్ని చెడగొట్టే విధంగానే కనిపిస్తోంది.
-Surya