మన చరిత్రేంటో లోకమంతా చూసింది.. ఎన్నికల హింసపై హైకోర్టు ఆవేదన

-

ఏపీలో ఎన్నికలు రణరంగాన్ని తలపించిన విషయం తెలిసిందే. పోలింగ్ తర్వాత కూడా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై ఇప్పటికే ఈసీ సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టింది. ఇక తాజాగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై హైకోర్టు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.

పల్నాడు జిల్లావ్యాప్తంగా ఎన్నికల రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంటూ వినుకొండకు చెందిన నలబోతు రామకోటేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై ఏపీ ధర్మాసనం విచారణ చేపడుతూ.. ఎన్నికల సందర్బంగా జరిగిన ఈ ఘర్షణలతో రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. పల్నాడులోని ఘటనలను అందరూ చూశారనేది జగమెరిగిన సత్యమని, అందుకు ఆధారాలను పరిశీలించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. హింసాత్మక ఘటనలపై ఆవేదన వ్యక్తం చేసింది.

రాష్ట్రంలో.. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ), డీజీపీలతో పాటు పల్నాడు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. అదనపు బలగాలను మోహరించాలంటూ పిటిషనర్‌ సమర్పించిన వినతిపైనా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version