ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టించుకునేది కేసీఆర్ మాత్రమేనని అన్నారు. పోలవరం కట్టేది, విశాఖ ఉక్కు పరిశ్రమలు కాపాడేది కూడా కేసీఆర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు మల్లారెడ్డి. అంతేకాదు ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు.
అక్కడ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం పూర్తిగా మానేసిందని.. కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఏపీలో అందరూ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే పక్క రాష్ట్రాలలో కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని.. కేసీఆర్ ని ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అయితే మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి చెట్లు పోయిన వేణుగోపాలకృష్ణ. మల్లారెడ్డి ఏపీ వచ్చి చూడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడకపోవడమే మంచిదని హితవు పలికారు. ఏపీలో సామాజిక న్యాయం అమలవుతుందన్నారు మంత్రి చెల్లుబోయిన.