కర్నూలు టీడీపీకి చెందిన నాయకుడు, దివంగత నాగిరెడ్డికి అత్యంత సన్నిహిత అనుచరుడు ఏవీ సుబ్బా రెడ్డి. నాగిరెడ్డి-సుబ్బారెడ్డి ఇద్దరూ కూడా రెండు దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. నాగిరెడ్డి మధ్యలో పార్టీ మారినా.. సుబ్బారెడ్డి టీడీపీలోనే ఉన్నారు. నాగిరెడ్డి మరణం తర్వాత.. అఖిల ప్రియ రాజకీయ వార సురాలిగా తెరమీదికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె ఏవీ సుబ్బారెడ్డిపై కత్తికట్టినట్టు వ్యవహరించారు. ఆళ్ల గడ్డ నియోజకవర్గంలో ఎదిగేందుకు ఏవీ సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారని, అది తమకు తల్లిలాంటి నియోజకవర్గమని పెద్ద ఎత్తున ఎదురు దాడి చేశారు అఖిల ప్రియ.
ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడడం, వాటిని చంద్రబాబు పలుమార్లు పరిష్కరించడం తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు అఖిల ప్రియకు మంత్రిపదవి ఇచ్చినట్టుగా ఏవీ సుబ్బారెడ్డి.. విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌గా నామినేటెడ్ పదవిని అప్పగించారు. ఇలా ఇద్దరినీ బుజ్జగించినా.. ఎవరూ కూడా సర్దుకోలేదు. దీంతో ఎన్నికల సమయంలో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకున్నాయి.
చంద్రబాబు పిలుపునిచ్చిన నిరసనల విషయంలో కూడా అఖిల ప్రియ దూకుడు ప్రదర్శించి విమర్శలకు కారణమయ్యారు. ఇక, ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలవడంతో ఇరు వర్గాల విషయంలోనూ మరింత దుమారం చోటు చేసుకుంది. నంద్యాల, ఆళ్లగడ్డల్లో భూమా వర్గం ఓడిపోయింది. అయినా కూడా అఖిల ప్రియ దూకుడు ఎక్కడా తగ్గలేదు. ఈ విషయంలో చంద్రబాబు సైతం పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో నాలుగు మాసాలుగా ఏవీ సైలెంట్‌గా ఉన్నారు.
టీడీపీలో ఉంటే.. తన వల్ల పార్టీకి మేలే తప్ప.. పార్టీ వల్ల తాను ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేక పోతున్నానని భావించి.. వైసీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. వైసీపీకి కూడా భూమా వర్గంతో సై అంటే సై అనే రేంజ్‌లో పోరాడే నాయకుడు అవసరం. గతంలో ఈ ఉద్దేశంతోనే శిల్పా వర్గాన్ని చేరదీస్తే.. వాళ్లు సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఏవీని పార్టీలోకి తీసుకుంటే.. మేలని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.