అయోధ్యలోని భ్యవ మందిరం బాలక్ రామ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయ ప్రతిష్ఠ రోజు నుంచి ప్రతిరోజు అయోధ్య సన్నిధిలో రద్దీ కొనసాగుతోంది. మరోవైపు అయోధ్యకు దేశవ్యాప్తంగా కానుకలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక బాలరాముడి ఆలయాన్ని అలంకరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పూలు, ఇతర అలంకరణ సామగ్రి వెళ్తోంది. ఈ క్రమంలోనే బాలరాముడికి ప్రియమైన ధనస్సును భక్తుల కానుకలతో తయారు చేయించారు అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ నిర్వాహకుడు చల్లా శ్రీనివాసశాస్త్రి (హైదరాబాద్).
ఈ ధనస్సును రామ మందిరం పైభాగంలో నిర్మాణంలో ఉన్న కోదండ రామాలయంలో స్వామికి అలంకరించనున్నారు. ఈ క్రమంలో ధనుస్సు, బాణాలను ఏపీలోని భీమవరం పట్టణంలోని లెక్చరర్స్ వీధిలో ఉన్న పురిఘళ్ల వెంకటరమణమూర్తి నివాసం వద్ద సోమవారం ప్రదర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల దర్శనార్థం ఊయలలో ఉంచారు. భక్తులు సమకూర్చిన 13 కిలోల వెండి, కిలో బంగారంతో వీటిని తయారు చేయించినట్లు చల్లా శ్రీనివాసశాస్త్రి తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వీటిని భక్తుల సందర్శనార్థం ప్రదర్శిస్తామని ఆయన వెల్లడించారు.