ఏపీలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలంటూ వైసిపి శుక్రవారం రోజు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఉచిత విద్యుత్ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని వైసిపి ఆరోపించింది. వైసిపి పార్టీ పిలుపుమేరకు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు నేడు ఆందోళన చేపట్టారు.
ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గం పుత్తూరులో మాజీ మంత్రి రోజా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలపై భారం మోపుతూ అంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ లో తిరిగే హక్కు మీకు ఎవరిచ్చారని విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. గత ఏడు నెలల్లోనే చంద్రబాబు లక్ష కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.
కేవలం 6 నెలల్లోనే 15, 500 కోట్ల విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం పెంచి ప్రజలపై భారం వేసిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచుతుంటే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారు..? అని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలకు షూరిటీ లేదు.. ఆయన మాటలకి గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు. కరెంట్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇసుక రేట్లు ఇలా అన్నీ పెంచేశారని దుయ్యబట్టారు.