ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, టిడిపి ఎంపీలు కేశినేని చిన్ని, బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఓ గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని అన్నారు.
ఆయన మరణం బాధాకరమని.. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వహించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు చంద్రబాబు. అంతేకాదు ఉపాధి హామీ, ఆధార్, విద్యా హక్కుకు చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు.
ఇక మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. వైయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. శనివారం రోజున ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్ వెల్లడించారు.