“బీసీలందు టీడీపీ.. బీసీలు వేరయా” అనేది చంద్రబాబు ఇంతకాలం చేసిన బీసీ రాజకీయం అయితే… తాజాగా “టీడీపీలోని బీసీలందు.. బాబు కోటరీ బీసీలు వేరయా” అనే నానుడి స్టార్ట్ అయ్యిందనే అనుకోవాలి. అందుకు తాజా ఉదాహరణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి!
మొన్నటికి మొన్న మంత్రి పేర్ని నాని సన్నిహితుడు మోకా భాస్కరరావు హత్య జరిగితే… ఈ కేసులో నిందితుడిగా ఎఫ్.ఐ.ఆర్ లో పేరు ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను చంద్రబాబు, టీడీపీ నేతలు పరామర్శించారు! సరే… ఎవరు చంపినా, మరెవరు చంపించినా కూడా మరణించింది కూడా బీసీ నే కదా… మరి టీడీపీ నేతలకు ఆ బీసీ వేరైపోయారా? లేక మోకా భాస్కర రావు బీసీ కాకుండాపోయారా?
తన దగ్గరకు జీతాలు పెంచమని వచ్చిన బీసీలను “తోకలు కత్తిరిస్తా.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా” అని అధికార గర్వంతో బెదిరించిన చంద్రబాబుకు… వచ్చిన వారు బీసీలని తెలియదా? వారిని కూడా బీసీలని గుర్తించండి ప్లీజ్!! వారు టీడీపీ కార్యకర్తలు కాదనే నమ్మకమే.. బాబును అలా మాట్లాడనిచ్చిందా? వారు టీడీపీ కార్యకర్తలు కాకపోయినా… బీసీలు కాకుండాపోరుగా? ఇది కేవలం ఒక వ్యక్తికో, ఒక కులానికో మాత్రమే సంబందించిన కాదు… బాబు మార్కు రాజకీయానికి ఒక ఉదాహరణ మాత్రమేనని గ్రహించండి!!
సరే అది పార్టీల ప్రేమ అని కాసేపు అనుకున్నా… ఇప్పుడు అచ్చెన్నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేసినందుకు.. టీడీపీలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని.. ఇది ఆరంభం మాత్రమే అని కబుర్లు చెబుతున్నారు బాబు & కో! మరి నిన్నటివరకూ రబ్బరు స్టాంపులా మిగల్చబడిన, మార్చబడిన కళా వెంకట్రావు కూడా బీసీనే కదా! మరి ఆయనను తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది.. ఆ బీసీ నేత మనోభావాలతో ఎందుకు ఆడుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ ఇద్దరూ బీసీ నేతలే కదా… ఇప్పుడు కళాను తప్పించి అచ్చెన్నకు పదవి ఇచ్చినంత మాత్రాన్న పార్టీకి ఏదో ఒరిగిపోయేది ఏమీ లేదు కదా.. కొత్త సీసాలో పాతనీరే అనుకోవచ్చు కదా! మరి కళాను ఎందుకు తప్పించారు..? అంటే… మళ్లీ ఇక్కడకు వచ్చేసరికి “టీడీపీ బీసీలందు బాబు అనుచర బీసి, బాబు కోటరీ బీసీలు వేరయా” అని నిరూపించడానికన్నమాట! రాజకీయాలందు బాబు బీసీ రాజకీయాలు వేరయా!!